దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా కథా ప్రయాణం వారణాసిలో మొదలై అంటార్కిటికా, ఆఫ్రికా ఖండాల మీదుగా సాగుతుందని రాజమౌళి తెలిపారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రోమ్ సామ్రాజ్య కాలానికి వెళ్లి, చివరగా తిరిగి వారణాసికి చేరుకునేలా ఈ కథ సాగుతుందని ఆయన వివరించారు.
ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్లో రూపొందించడానికి గల కారణాలను కూడా రాజమౌళి పంచుకున్నారు. అంటార్కిటికాలోని 300 అడుగుల ఎత్తైన మంచు కొండలు, ప్రాచీన రోమ్ సామ్రాజ్యపు భారీ సైన్యాలను తెరపై చూపించేటప్పుడు ఆ ఇంటెన్సిటీ ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో అందాలంటే ఐమ్యాక్స్ స్క్రీన్ మాత్రమే సరైనదని ఆయన పేర్కొన్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబు వివిధ గెటప్స్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన రాముడిగా కనిపిస్తారని రాజమౌళి సూచనప్రాయంగా వెల్లడించారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మూడు కొత్త పోస్టర్లు విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వీటిలో మహేష్ బాబు సింహంతో ఉన్న ఫోటో కూడా ఉండవచ్చని వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.








