దేశీయ ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి సరికొత్త మైలురాయిని చేరుకుంది. జూలై 2026లో దేశవ్యాప్తంగా మొత్తం 2,00,123 వాహనాలను విక్రయించి, ఒకే నెలలో 2 లక్షల మార్కును దాటిన తొలిసారిగా రికార్డు నమోదు చేసింది. ఎగుమతులతో కలిపి సంస్థ మొత్తం 2,41,241 వాహనాలను పంపిణీ చేసింది.
గత ఏడాది జూలైలో 1,80,526 వాహనాలను విక్రయించిన సంస్థ, ఈసారి ఆ సంఖ్యను భారీగా పెంచుకుంది. జూలై 2025లో దేశీయ అమ్మకాలు 1,40,570 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 2 లక్షలకు చేరింది. ఇందులో ప్యాసింజర్ వాహనాల వాటా 1,93,203 యూనిట్లు కాగా, కమర్షియల్ వాహనాలు 3,920 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ప్రస్తుతం సంస్థ వద్ద సుమారు 1.60 లక్షల పెండింగ్ బుకింగ్‌లు ఉన్నాయని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బానర్జీ తెలిపారు. కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌కు ప్రతిరోజూ 2,000 బుకింగ్‌లు, ఇ-విటారా ఎలక్ట్రిక్ SUVకి నెలకు 4,000 బుకింగ్‌లు వస్తున్నాయి.
కొత్త మోడళ్లకు లభిస్తున్న ఆదరణ, పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రానున్న నెలల్లో కూడా అమ్మకాలు బలంగా కొనసాగే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది.








