బీహార్‌లోని బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో జన్ సూరజ్ పార్టీ (JSP) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 14 రౌండ్ల కౌంటింగ్ ముగిసే సమయానికి ఆయన 28,201 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా 20,420 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తా 6,142 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. 1995 నుంచి ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. అటువంటి స్థానంలో తొలిసారి పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్, ప్రస్తుతం 8,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విజేతను నిర్ణయించేందుకు మొత్తం 31 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉంది. ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఆరంగ్రేటానికి ఈ ఫలితం కీలకమైనదిగా భావిస్తున్నారు.