కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సోమవారం (ఆగస్ట్ 3) 20 మందితో కూడిన తుది జాబితాను ఆమోదించారు. దీంతో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంది.

సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఈ విస్తరణ చేపట్టారు. ఇందులో యువతకు, మైనారిటీలకు ప్రాధాన్యత కల్పించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేయాలని సీఎం డీకే శివకుమార్ లోక్ భవన్‌ను కోరారు. 2026 జూన్ 4న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా, మరో 13 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ విస్తరణతో మంత్రివర్గంలోని మొత్తం 34 స్థానాలు భర్తీ అయ్యాయి. ఇదే సమయంలో రోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీఎస్ పాటిల్ అసెంబ్లీ స్పీకర్‌గా, ఎ.ఎస్. పొన్నన్న డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. శాసన మండలి చైర్మన్‌గా సలీం అహ్మద్, డిప్యూటీ చైర్మన్‌గా ఉమాశ్రీ నామినేట్ అయ్యారు.

కొత్తగా మంత్రివర్గంలోకి చేరనున్న వారిలో పి.ఎం. నరేంద్రస్వామి, శివరాజ్ తంగడగి, రుద్రప్ప లమాని, కె.ఎస్. బసవంతప్ప, బి. నాగేంద్ర, టి. రఘుమూర్తి, బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అర్షద్, సంతోష్ లాడ్, బంగారప్ప, పుట్టరంగశెట్టి, మంకాల వైద్య, ఎన్. చలువరాయ స్వామి, కె.ఎం. శివలింగే గౌడ, హెచ్.సి. బాలకృష్ణ, గాయత్రి శాంతే గౌడ, అజయ్ సింగ్, బసవరాజ్ రాయరెడ్డి, విజయానంద్ కాశప్పనవర్, లక్ష్మణ్ సవది ఉన్నారు.